నిర్భయ దోషులను ఉరితీసేందుకు సిద్ధం,ఉరి వేసేది ఎప్పుడంటే?

నిర్భయ దోషులను వెంటనే ఉరి తీయాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఈ  క్రమంలోనే నిర్భయ దోషులను వీలైనంత త్వరగా ఉరి తీసేందుకు సిద్ధం అయ్యారు అధికారులు. బీహార్ రాష్ట్రంలోని బుక్సర్ సెంట్రల్ జైలు ఖైదీలు ఉరితాళ్లు పేనుతున్నారు.  ఢిల్లీలోని తీహార్ జైలులో నిర్భయ కేసులో నలుగురు దోషులు ఉన్నారు. వీరికి ఉరి శిక్ష పడగా.. కొంతకాలంగా శిక్ష అమలు కాలేదు. 

నిర్భయ కేసులో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించవద్దని కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు విన్నివించిన నేపథ్యంలో మూడు రోజుల క్రితమే ఉరితాళ్లు సిద్ధం చేయాలని బుక్సర్ జైలుకు ఆదేశాలు వచ్చాయి. ఏడుగురు ఖైదీలు నాలుగురోజుల పాటు శ్రమించి థ్రెడ్ తో కూడిన ఉరితాళ్లను పేనుతున్నారు. గతంలో అఫ్జల్ గురు ఉరి కోసం ఉరితాళ్లు తయారు చేసిన ఖైదీలే నిర్భయ దోషుల ఉరి కోసం కూడా ఉరితాళ్లను తయారు చేసే పనిలో పడ్డారు. నిర్భయ దోషులను డిసెంబర్ 16వ తేదీన ఉదయం 5గంటలకు ఉరి తీయనున్నట్లు తెలుస్తుంది. నిర్భయపై ఏరోజైతే అత్యాచారం చేశారో అదే రోజు దోషులను ఉరి తీయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.