శబరిమల వెళ్లేందుకు యత్నించిన మ‌హిళ‌పై కారంపొడితో దాడి..

ఈ ఏడాది జ‌వ‌న‌రి 2వ తేదీన శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప‌స్వామి ద‌ర్శ‌నం చేసుకున్న కేర‌ళ‌కు చెందిన బిందు అమ్మాని అనే మ‌హిళ‌పై ఇవాళ ఆందోళ‌న‌కారులు కారంపొడితో దాడి చేశారు. ఎర్నాకుళం సిటీ పోలీస్ క‌మీష‌న‌ర్ ఆఫీసు ఎదుట ఈ ఉద‌యం ఈ ఘ‌ట‌న జ‌రిగింది. సామాజిక కార్య‌క‌ర్త తృప్తీ దేశాయ్‌తో బిందు శ‌బ‌రిమ‌ల‌ వెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. అయితే భ‌ద్ర‌త క‌ల్పించాలంటూ వాళ్లు పోలీసు క‌మీష‌న‌ర్‌ ఆఫీసుకు వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో బిందుపై కొంద‌రు కారంపొడి, పెప్ప‌ర్‌తో దాడి చేశారు. కేర‌ళ‌లోని క‌న్నూరు వ‌ర్సిటీలో బిందు లెక్చ‌ర‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఇవాళ రాజ్యాంగ దినోత్స‌వం అని, ఈ సంద‌ర్భంగా తాము శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప‌స్వామిని ద‌ర్శించుకుంటామ‌ని మ‌హిళా హ‌క్కుల కార్య‌క‌ర్త తృప్తీ దేశాయ్ మీడియాతో తెలిపింది. రాష్ట్ర ప్ర‌భుత్వం కానీ, పోలీసులు కానీ త‌మ‌ను అడ్డుకోలేర‌న్నారు. త‌మ‌కు సెక్యూర్టీ ఇచ్చినా, ఇవ్వ‌క‌పోయినా తాము మాత్రం ఆల‌యానికి వెళ్తామ‌న్నారు.