మానవత్వాన్ని చాటిన హోంగార్డులు

హోంగార్డులు మానవత్వాన్ని చాటుకున్నారు…నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ కు చెందిన బుచ్చమ్మ(సుమారు 75)కు ఐదుగురు అమ్మాయిలు, నలుగురు కొడుకులు. వారందరికీ వివాహాలు అయ్యాయి. భర్త చనిపోవడంతో ఒంటరిగా మారింది. కొడుకులు, కూతుళ్లు పట్టించుకోకపోవడంతో KPHB కాలనీ పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ జీవిస్తుంది. నాలుగు రోజులుగా రోడ్డుపైనే కూర్చుని నడవలేని స్థితిలో ఉన్న బుచ్చమ్మను చూసిన కూకట్ పల్లి ట్రాఫిక్ హోంగార్డ్ బి.గోపాల్ ఆమెకు అల్ఫాహారం తినిపించాడు. అనంతరం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు.

మరో ఘటనలో… కూకట్‌పల్లిలో ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఓ బాలిక(4) వాహనాల మధ్య నుంచి నడుచుకుంటూ వస్తున్నది. అక్కడే విధులు నిర్వహిస్తున్న హోం గార్డు జహంగీర్ పటేల్ గమనించి బాలికను చేరదీసి వివరాలు అడుగగా సమాధానం చెప్పలేదు. పదేపదే బాలికను కుటుంబ వివరాలపై ఆరా తీశాడు. అయినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ట్రాఫిక్ బూత్ వద్దకు తీసుకొచ్చాడు. 45 నిమిషాల తర్వాత పాప తండ్రి బూత్ సమీపంలో నుంచి వెళ్తుండగా బాలిక గుర్తించి వెళ్లింది. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు, బాలిక తల్లిదండ్రులు హోంగార్డుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విధంగా ఇద్దరు హోంగార్డుల సేవలు ఆదివారం పోలీసు ప్రతిష్టను పెంచడంతో పాటు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షాన్ని కురిపించింది.