డైవ్‌ చేసి మరీ ఒడిసిపట్టుకున్నాడు: ఎల్గర్ అద్భుత క్యాచ్‌ని చూశారా? (వీడియో)

దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య ఇక్కడి వాండరర్స్ స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టులో దక్షిణాఫ్రికా ఆటగాడు డీన్ ఎల్గర్ పట్టిన క్యాచ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 488 పరుగులు చేయగా, అనంతరం ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభించింది. ఆదివారం లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా ఏడు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.లంచ్ తర్వాత నాథన్ లియాన్, చాద్ సేయర్ల వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడిన జట్టు బాధ్యతను తాత్కాలిక కెప్టెన్ టిమ్ పైనె (50) తన భుజాలపై వేసుకున్నాడు. జాగ్రత్తగా ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. సహచరులు వెనుదిరుగుతున్నా సంయమనంతో ఆడుతూ సఫారీ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. చివరికి రబడా బౌలింగ్‌లో ఎల్గర్ అద్భుతమైన క్యాచ్‌కు పైనే పెవిలియన్ చేరాడు. రబడ వేసిన బంతిని మిడ్ వికెట్ మీదుగా బాదిన పైనె..ఎల్గర్ కళ్లు చెదిరే క్యాచ్‌కు అవుటయ్యాడు. మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఎల్గర్ ఆ క్యాచ్‌ను పట్టుకోవడం అసాధ్యమని అందరూ భావించారు. అయితే, క్షణంలోని వెయ్యో వంతులో పరుగెత్తుకొచ్చి సూపర్ మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి బంతిని అందుకున్నాడు. అతడు బంతి అందుకున్న తీరును చూసి పైనె సహా సహచర ఆటగాళ్లు, స్టేడియంలోని అభిమానులు, కామెంటేటర్లు నోరెళ్లబెట్టారు.తమ జీవితంలో ఇలాంటి అద్భుత క్యాచ్‌ చూడలేదంటూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరైతే టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలోనే ఇదే అత్యుత్తమ క్యాచ్‌ అంటూ ఎల్గర్‌ను కొనియాడుతున్నారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 221 పరుగులకే ఆలౌటైంది. అనంతరం మూడో రోజు ఆటను కొనసాగించిన సఫారీలు ఆట ముగిసే సమయానికి 56 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేశారు.