దినేశ్ కార్తీక్ అరుదైన ఘనత

దహాస్ ట్రోఫీలో భాగంగా  మార్చి-18 బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్‌లో భారత్ అద్భుత విజయం సాధించింది. టీ20లోని అసలైన మజాను పంచిన ఈ మ్యాచ్‌లో చివరి బంతి వరకు విజయం ఎవరిని వరిస్తుందా అని ప్రతి ఒక్కరిలో టెన్షన్. చివరికి ఇన్నింగ్స్ చివరి బంతిని దినేశ్ కార్తీక్ సిక్సర్‌గా మలిచి భారత్‌కు ట్రోఫీని అందించాడు. దీంతో దినేశ్ కార్తీక్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో చివరి బంతిని సిక్సర్‌గా మలిచి విజయాన్ని అందించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.గతంలో జావెద్‌ మియందాద్‌(పాకిస్థాన్‌), రియన్‌ మెక్‌లారెన్‌(సౌతాఫ్రికా), నాథన్‌ మెక్‌కల్లమ్‌(న్యూజిలాండ్‌), లాన్స్‌ క్లుసెనర్‌(సౌతాఫ్రికా), శివనారాయణ్‌ చంద్రపాల్‌(వెస్టిండీస్‌) ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో లాస్ట్ బాల్ కి సిక్స్‌ కొట్టి విజయాన్ని అందించిన ఘనత సాధించారు. ఇప్పుడు వీరి సరసన దినేష్‌ కార్తీక్‌ చేరాడు. అంతేకాదు.. లక్ష్య ఛేదనలో ఇంటర్నేషనల్ టీ20 ఫైనల్లో లాస్ట్ బాల్ కి సిక్స్‌ కొట్టి, జట్టుకు విజయం అందించిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా దినేశ్‌ కార్తీక్‌ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 8 బంతులు ఎదుర్కొన్న దినేశ్ కార్తీక్ 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 362.5 సగటుతో 29 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చివరి బంతికి ఐదు పరుగులు కావాల్సిన తరుణంలో సిక్సర్ కొట్టి భారత్‌ను గెలిపించిన కార్తీక్‌పై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది.